అమెరికాలో మంచు తుఫాన్.. 2వేల విమాన సర్వీసులు రద్దు
అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 4:29 AM GMTఅమెరికాలో మంచు తుఫాన్.. 2వేల విమాన సర్వీసులు రద్దు
అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ చలికాలం తుఫాన్ కారణంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మంచు పేరుకుపోయింది. దాంతో.. రవాణా సౌకర్యాలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా మిడ్‌వెస్ట్ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుఫాను వల్ల ఏకంగా 2000 విమానాలు రద్దు అయ్యాయి. మరో 2400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంగా నడుస్తుండటంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.
విమానాలు రద్దు అయిన విమనాశ్రయాల్లో చికాగోలోని ఓ’హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒకటి. ఇందులో 40 శాతం విమానాలను రద్దు చేశారు. 36 శాతం విమానాలు ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉండగా.. ఇక చికాగో మిడ్‌వేస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమానాలు రద్దు అయ్యాయి. డెన్వర్ ఎయిర్‌పోర్టు, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులతో పాటు.. పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయినట్లు ఆయా ఎయిర్‌పోర్టుల అధికారులు తెలిపారు. ఇక ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌లో ఇబ్బంది ఉండటంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడానికి కారణమంటున్నారు.
తీవ్రమైన మంచు కురుస్తుండటంతో అక్కడున్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. గ్రేట్ లేక్స్, సౌత్ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా అవ్వడం లేదు. ఇల్లినాయిస్‌లో దాదాపు 97వేల మంది చీకట్లోనే ఉంటున్నారు. ఇలా చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. రవాణా సౌకర్యాలు కూడా తగ్గిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.