దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.. బుల్లెట్‌ గాయం తర్వాత ట్రంప్‌ ఫస్ట్‌ స్పీచ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి.

By Srikanth Gundamalla  Published on  19 July 2024 10:45 AM IST
America election, Donald trump, first speech,  attack,

దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.. బుల్లెట్‌ గాయం తర్వాత ట్రంప్‌ ఫస్ట్‌ స్పీచ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. ఇటీవల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై గన్‌ ఫైర్‌ జరిగింది. ఆ ఘటనలో ట్రంప్‌ చెవి పైభాగంగా బుల్లెట్‌ దూసుకెళ్లింది. దాంతో గాయం అయ్యింది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని కవర్‌ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే.. తాజాగా ఈ బుల్లెట్‌ గాయం తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి స్పీచ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో భావోద్వేగమైన కామెంట్స్ చేశారు.

రిపబ్లికన్ సదస్సు చివరి రోజు సమావేశంలో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దేవుడి ఆశీస్సులు తనకు ఉన్నాయనీ.. అందుకు ఇవాళ మీముందు ఉన్నానంటూ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఇవాళ ఉండేవాడిని కాదని ట్రంప్‌ చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్‌ అధికారికంగా అంగీకరించారు. ఈ సందర్భంగా వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. సువర్ణాధ్యాయాన్ని ప్రజలు చూడబోతున్నారని అన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

తనపై జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్‌ మరోసారి గుర్తు చేసుకున్నారు. బుల్లెట్‌ తగిలేముందే తన తల తిప్పాననీ.. అందుకే చెవికి తగిలిందని అన్నారు. లేదంటే తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లి ఉండేదన్నారు. దేవుడి ఆశీస్సులు ఉండటం వల్లే తాను బతికానని చెప్పుకొచ్చారు. భగవంతుడే తన మృత్యువును అడ్డుకున్నట్లుగా చెప్పారు డొనాల్డ్ ట్రంప్.

మరోవైపు అధ్యక్ష రేసునుంచి బైడెన్ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతకుముందే ఆయన అనారోగ్యంతో ఉంటే మాత్రం పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ క్రమంలోనే కోవిడ్ పాజిటివ్‌గా రావడం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Next Story