షాకింగ్‌: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా మరణాలు

America corona update ... ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పూర్తి స్థాయిలో కరోనాను అరికట్టేందుకు

By సుభాష్  Published on  2 Dec 2020 7:31 PM IST
షాకింగ్‌: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పూర్తి స్థాయిలో కరోనాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అమెరికాలో మాత్రం అతలాకుతలం చేసింది. ఒక వైపు పాజిటివ్‌ కేసులు, మరో వైపు కరోనా మరణాలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు కంటినిండా కునుకులేకుండా చేసింది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినా కేసులు మళ్లీ ఇప్పుడు అమెరికా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 2,500 మందికిపైగా కరోనాతో మృతి చెందినట్లు జాన్‌ హప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్‌ తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని వెల్లడించింది.

మంగళవారం ఒక్క రోజు అమెరికాలో 1.8 లక్షల మంది కరోనా బారిన పడ్డారంటే మళ్లీ ఏ మేరకు మహమ్మారి విజృంభిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే సగటున నిమిషానికి ఒక కరోనా మరణం నమోదువుతుందని గ్లోబల్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ బెత్‌బెల్‌ తెలిపారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1.41 కోట్ల మంది కరోనా బారిన పడగా, కరోనా మరణాలు 2.80 లక్షలకు చేరువలో ఉన్నాయి.

Next Story