'వారితో టచ్‌లో ఉన్నాం..', నిమిషా ప్రియా కేసుపై విదేశాంగ ప్రకటన

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 17 July 2025 7:00 PM IST

వారితో టచ్‌లో ఉన్నాం.., నిమిషా ప్రియా కేసుపై విదేశాంగ ప్రకటన

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. మేము న్యాయ సహాయం అందించాము. కుటుంబానికి సహాయం చేయడానికి ఒక న్యాయవాదిని నియమించాము. సమస్యను పరిష్కరించడానికి మేము స్థానిక అధికారులు, ఇమిషా కుటుంబ సభ్యులను కూడా సంప్రదిస్తున్నామని వెల్ల‌డిచారు.

ఇతర పక్షంతో పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేరుకోవడానికి.. తన కుటుంబానికి మరింత సమయం ఇవ్వడానికి.. గత కొన్ని రోజులుగా సంఘటిత ప్రయత్నిస్తున్న‌ట్లు ఆయన చెప్పారు. మేము విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉంటాము. ఈ విషయంలో సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తాము. ఈ విషయంలో కొన్ని స్నేహపూర్వక ప్రభుత్వాలతో కూడా టచ్‌లో ఉన్నామ‌ని తెలిపారు.

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష ప్రస్తుతానికి వాయిదా ప‌డింది. నిమిషా ప్రియ గత ఎనిమిదేళ్లుగా యెమెన్‌లో జైలులో ఉండగా, అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు హత్యానేరం కింద మరణశిక్ష విధించింది. ఆమెను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, నిమిషా ప్రియను ఉరితీసే తేదీని ఇటీవల జూలై 16, 2025గా నిర్ణయించారు.

భారతీయ నర్సుకు బుధవారం విధించాల్సిన మరణశిక్షను స్థానిక యంత్రాంగం ప్రస్తుతం వాయిదా వేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై భారత సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలైంది. ఇది వేరే దేశంలో దాఖలైన కేసు కాబట్టి ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

నిమిషా ప్రియా కేసులో భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిమిషా ప్రియ కుటుంబ సభ్యులకు అన్ని రకాల సలహాలు ఇవ్వడంతో పాటు యెమెన్‌లోని న్యాయపరమైన అంశాల గురించి కూడా వారికి సమాచారం అందజేస్తున్నారు. నిమిషా కుటుంబాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులతో కనెక్ట్ చేయడంలో రాయబార కార్యాలయం కూడా తన పాత్రను పోషించింది.

కేరళకు చెందిన నిమిషా చదువు తర్వాత యెమెన్‌లో ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ యెమెన్ పౌరుడు తలత్ అబౌద్ మెహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించింది. మెహదీ ఆమెను ఆర్థికంగా, శారీరకంగా దోపిడీ చేసేవాడు. ప్రియ పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ప్రియా తన భర్తను, బిడ్డను ఇండియాకు పంపించింది. యెమెన్ కోర్టులో నమోదైన కేసు ప్రకారం.. నిమిషా తన పాస్‌పోర్ట్ ద‌క్కించుకోవ‌డానికి మెహదీకి మత్తుమందు ఇవ్వ‌గా.. అత‌డు మరణించాడు.

Next Story