ఇథియోపియాలో మారణహోమం.. వైమానిక దాడిలో 51 మంది మృతి.. 100మందికిపైగా గాయాలు

Airstrike in Ethiopia's Tigray kills more than 50.ఇథియోపియాలో మారణ‌హోమం జ‌రిగింది. ఉత్త‌ర టిగ్రే ప్రాంతంలో ఉన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 5:22 AM GMT
ఇథియోపియాలో మారణహోమం.. వైమానిక దాడిలో 51 మంది  మృతి.. 100మందికిపైగా గాయాలు

ఇథియోపియాలో మారణ‌హోమం జ‌రిగింది. ఉత్త‌ర టిగ్రే ప్రాంతంలో ఉన్న టొగొగా గ్రామంలోని ఓ మార్కెట్‌పై వైమానిక దాడి జ‌రిగింది. ఇప్పటి వ‌ర‌కు 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీక‌రించారు. ఇంకా 33 మంది ఆచూకీ అంతు చిక్క‌డం లేదు. 100 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు టైగ్రే హెల్త్ బ్యూరోకు చెందిన ఒక అధికారి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. అందులో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన‌ట్లు తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ దాడిలో 80 మందికి పైగా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. అధికారికంగా దీనిని ధ్రువీక‌రించలేదు.

దాడిలో గాయపడిన కొంతమంది మేకెలెలోని ఐడర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..గతేడాది నవంబరు నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వైమానిక దాడి జరిగింది. మార్కెట్‌పై విమానం నుంచి బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

Next Story
Share it