ఘోర ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ట్రక్కును ఢీకొట్టిన విమానం..!
అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By - Medi Samrat |
అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. మాంట్రియల్ నుంచి వస్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఉన్న వేరే వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయంలో గందరగోళం నెలకొనడంతో విమాన కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేయవలసి వచ్చింది.
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లా గార్డియా విమానాశ్రయంలో "గ్రౌండ్ స్టాప్" విధించింది. దీని అర్థం.. అక్కడ ఏ విమానం కూడా ల్యాండ్ అవ్వడం గానీ, టేకాఫ్ అవ్వడం గానీ కుదరదు. అత్యవసర పరిస్థితి కారణంగా విమానాశ్రయం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడి ఉంటుందని ఆ సంస్థ ఒక ప్రాథమిక ప్రకటనలో తెలిపింది.
లాగార్డియా న్యూయార్క్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఈ ప్రమాదం దాని ఫలితంగా విధించిన ఆంక్షల వల్ల వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఇలాంటి రన్‌వే సంఘటనలు అరుదుగా జరిగినా, అవి మొత్తం విమానయాన వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని విమానయాన నిపుణులు అంటున్నారు.
నివేదికల ప్రకారం.. పలు విమానాలను దారి మళ్లించారు. ఎయిర్ కెనడా, న్యూయార్క్ అగ్నిమాపక విభాగం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు జారీ చేయలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి విచారణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.