మరో అంతుచిక్కని వైరస్.. సోకిన 24 గంటల్లో మృతి
. పశ్చిమ ఆఫ్రికాలోని బురుండి దేశంలో ఓ కొత్త వైరస్ బయటపడింది. ఈ అంతుచిక్కని వైరస్ కారణంగా ఒక్క రోజులోనే
By అంజి Published on 31 March 2023 10:14 AM ISTమరో అంతుచిక్కని వైరస్.. సోకిన 24 గంటల్లో మృతి
మూడేళ్ల కిందట కరోనా వైరస్ ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే. ఆ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త వైరస్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని బురుండి దేశంలో ఓ కొత్త వైరస్ బయటపడింది. ఈ అంతుచిక్కని వైరస్ కారణంగా ఒక్క రోజులోనే ముగ్గురు చనిపోయారు. ఈ వైరస్ బారిన పడిన వారికి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ సోకిన 24 గంటల్లో వ్యక్తిని చంపేస్తుందని నివేదించబడింది.
బురుండి ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మైకం రావడం వంటి లక్షణాలు ఈ వైరస్ సోకితే కనిపిస్తాయి. బురుండిలోని బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకింది. బురుండిలోని ఈశాన్య ప్రాంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వ్యక్తులు గిటోబ్ కమ్యూనిటీకి చెందినవారు. వారూ బజిరో ప్రాంతంలోని మిగ్వా కొండ సమీపంలో నివసించారు. ఈ కొత్త వైరస్‌తో నమోదైన కేసులన్నీ ఇక్కడి నుంచి వచ్చినవేనని అధికారులు తెలిపారు.
అధికారులు వెంటనే అప్రమత్తమై పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. బురుండిలో ఓ నర్సు మాట్లాడుతూ.. ఈ వ్యాధి బాధితులను చాలా వేగంగా చంపుతుందని చెప్పారు. ఇటీవల బురుండి పక్కన ఉండే టాంజానియాలోనే మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి చెందింది. బురుండితో నేరుగా సరిహద్దు ఉన్న టాంజానియా యొక్క వాయువ్య ప్రాంతంలో ఈ అన్ని కేసులు కనుగొనబడ్డాయి. దీంతో చుట్టుపక్కల దేశాలకు ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, బురుండిలో వ్యాపిస్తున్నది మార్గ్‌బర్గ్ వైరసేనా? లేకా మరో కొత్త వైరసా అనేది తెలియాల్సి ఉంది.