తాలిబన్ల పైశాచికత్వం.. మీడియాకు సంకెళ్లు..!
Afghan Journalists Recount Horror After Arrest by Taliban.ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు రోజు రోజుకు
By అంజి Published on 8 Sept 2021 1:30 PM IST
ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తమ పైశాచికత్వంతో ఆప్ఘాన్ పౌరులను తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు. స్వేచ్ఛ కోసం ఆందోళన బాట పట్టిన మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడుతూ వారిని ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. తాజాగా తమ హక్కులను కాపాడుకునేందుకు మహిళలు పాకిస్తాన్ ఎంబసీ వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాక్‌కు, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలతో తాలిబన్లు ఆగ్రహం చెంది గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే అక్కడే ఉండి వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులకు దిగారు. అలాగే పలువురు జర్నలిస్టులను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
మహిళల నిరసనను కవర్ చేస్తున్న తన పట్ల తాలిబన్లు అమానుషంగా ప్రవర్తించారని, వార్తను కవర్ చేసినందుకు నాతో ముక్కు నేలకు రాయించారని ఓ జర్నలిస్టు వాపోయారు. అయితే తాను ప్రాణభయంతో ముక్కు నేలకు రాశానన్నారు. మరో జర్నలిస్టు కెమెరాను లాక్కొని ధ్వంసం చేశారని, కాలితో తనను తన్నినట్లు ఆరోపించారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో ప్రముఖ వార్తా సంస్థ టోలో న్యూస్ కెమెరామెన్ కూడా ఉన్నట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. టోలో న్యూస్ హెడ్ లోట్‌పుల్లా నజాఫిజాదా క్షమించమని కోరడంతో అతడిని, అతడితో పాటు మరో 12 మందిని విడిచిపెట్టారు. ఈ విషయాన్ని నజాఫిజాదా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడే వార్తలను కవర్ చేస్తున్న మరో వార్త సంస్థ అరియానాకు చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే రెండు గంటల తర్వాత వారిని కూడా వదిలేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.