భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

A huge asteroid hurtling towards Earth. అంతరిక్షంలోని ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. ఈ గ్రహ శకలం గుజరాత్‌లో ఏర్పాటు చేసిన,

By అంజి  Published on  16 Sep 2022 4:27 AM GMT
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

అంతరిక్షంలోని ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. ఈ గ్రహ శకలం గుజరాత్‌లో ఏర్పాటు చేసిన, ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా పొడవైనది. సొలార్‌ సిస్టమ్‌లో చాలా గ్రహ శకలాలు తమ నిర్దారిత కక్షల్లో తిరుగుతుంటాయి. అలాంటి ఒక గ్రహ శకలమే 2005RX3. ఈ భారీ గ్రహ శకలం సెప్టెంబర్ 18న భూమికి అతి దగ్గరగా రానుంది. ఈ గ్రహశకలం గతంలోనూ భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. 2005లో భూమికి దగ్గరగా వచ్చిన ఈ ఆస్టరాయిడ్.. మళ్లీ 2036లో భూమికి అత్యంత సమీపంలోకి రానుంది.

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ 192 మీటర్ల ఎత్తు ఉండగా, 2005RX3 గ్రహశకలం పొడవు దాదాపు 210 మీటర్లు. ప్రస్తుతం ఈ గ్రహ శకలం గంటకు 62,820 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది. ప్రస్తుతం ఇది భూమి, సూర్యుడి మధ్య ఉన్న దూరం కన్నా 1.3 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. ఈ విషయాన్ని నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వెల్లడించింది. సెప్టెంబర్ 18న ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంలో నుంచి దూసుకువెళ్తుంది. అత్యంత సమీపం అంటే కూడా దాదాపు 47 లక్షల కిమీల దూరం నుంచి అని, కాస్మిక్ దూరాల విషయంలో దీన్ని సమీపంగానే పరిగణిస్తారన్న మాట.

460 కోట్ల సంవత్సరాల క్రితం సొలార్‌ సిస్టమ్‌ ఏర్పడినప్పుడు మిగిలిన శిథిలాలే.. ఈ గ్రహ శకలాలు. తాజాగా 2005 RX3 గ్రహ శకలంతో పాటు మరో నాలుగు గ్రహశకలాలు కూడా ఈ వారం భూమికి సమీపంగా రానున్నాయి. అవి 2020 PT4, 2022 QD1, 2022 QB37, 2022 QJ50. వీటిలో 2020 PT4 గంటకు 39 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోంది. 2022 QD1 గ్రహశకలం గంటకు 34 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోంది. రేపు ఇది భూమిని దాటి వెళ్తుంది. గ్రహ శకలం 2022 QB37 కూడా సెప్టెంబర్ 18న భూమికి సమీపంగా వచ్చి వెళ్లనుంది. గంటకు 33 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోన్న 2022 QJ50 గ్రహశకలం.. ఈ వారాంతంలో భూమికి సమీపంగా రానుంది.

Next Story