3 గంట‌ల వ్య‌వ‌ధిలో 28.5 సెంటీమీటర్ల వర్షం.. వ‌రద‌లు.. 78 మంది మృతి

78 Killed In Flash Floods In Brazil.బ్రెజిల్‌పై ప్రకృతి ప‌గ‌బ‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రియో డి జెనిరో రాష్ట్రంలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 4:57 AM GMT
3 గంట‌ల వ్య‌వ‌ధిలో 28.5 సెంటీమీటర్ల వర్షం.. వ‌రద‌లు.. 78 మంది మృతి

బ్రెజిల్‌పై ప్రకృతి ప‌గ‌బ‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రియో డి జెనిరో రాష్ట్రంలోని పెట్రొపొలిస్‌ నగరాన్ని భారీవర్షాలు ముంచెత్తాయి. కేవ‌లం మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో 28.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున వ‌ర‌ద సంభ‌వించింది. న‌గరంలోని వీధుల‌న్నీ వ‌ర‌ద నీటితో నిండిపోయాయి. ప‌లువురు వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయారు. కొన్ని చోట్ల‌ కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఇళ్ల‌పై కొండ‌చ‌రియ‌లు ప‌డ‌డంతో ప‌లు ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 78 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఇక వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు గాలింపు చేప‌ట్టారు.బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. 22 మందిని ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలతో ర‌క్షించిన‌ట్లు అధికారులు తెలిపారు. బురదతో కూడిన వరదనీటిలో చిక్కుకున్న అనేకమంది సాయం కోసం గట్టిగా కేకలు వేశారని, అయితే.. వారిని కాపాడుకోలేకపోయానని రోసిలీన్ వర్జిలియో (49) అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంది.

వ‌రద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి వారికి ఆహారం, నీరు, దుస్తులు, మాస్కులు అందిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మూడు నెలల్లో పడాల్సిన వర్షం మూడు గంటల్లోనే కురిసిందని మేయర్ కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. వ‌ర‌ద విష‌యం తెలిసిన ఆయ‌న సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

Next Story