నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 76 మంది మృతి చెందగా, మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నారు. ఒగ్‌బారూ ప్రాంతంలో నైజర్ నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో పడవ మునిగింది. పడవ ప్రమాదంపై వెంటనే సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నైజీరియా ప్రభుత్వం రెస్క్యూ, రికవరీ మిషన్లను వేగవంతం చేసింది. ఘటనా స్థలంలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు.
గల్లంతైన వారి కోసం సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 76 మృతదేహాలు వెలికితీశారు. 76 మంది మరణించినట్లు అత్యవసర సంస్థలు నిర్ధారించాయని నైజీరియా ప్రెసిడెన్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘోర ప్రమాదంపై నైజీరియా ప్రెసిడెంట్ ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారుల్ని నైజీరియా అధ్యక్షుడు ఆదేశించారు.