స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. ముగ్గురు చిన్నారులతో పాటు మొత్తం 7 గురు మృతి
టేనస్సీలోని నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ యువతి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 9:10 AM ISTక్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సోమవారం టేనస్సీలోని నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ యువతి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పాఠశాల సిబ్బందితో పాటు కాల్పులు జరిపిన యువతి మొత్తం ఏడుగురు మరణించారు.
ఈ పాఠశాలలో ఆరో తరగతి వరకు విద్యను బోధిస్తుంటారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరణించిన వారిలో పాఠశాల సిబ్బంది సింథియా పీక్(61), కేథరిన్ కూన్స్(60) మైక్ హిల్(61) లతో పాటు 9 ఏళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నారు.
సోమవారం ఉదయం 10.27 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎదరుకాల్పులు జరిపారు. యువతి మరణించింది. కాల్పులకు పాల్పడింది అదే పాఠశాల పూర్వ విద్యార్థి అయిన 28 ఏళ్ల అడ్రీహేల్‌గా గుర్తించారు. ఆమె ఓ ట్రాన్స్ జెండర్ అని మెట్రోపాలిటన్ నాష్విల్లే పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ తెలిపారు.
హేల్ వద్ద అసాల్ట్ రైఫిల్, తుపాకీ అలాగే పిస్టల్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కోపంతో ఈ పని చేసి ఉండొచ్చునని పోలీసులు బావిస్తున్నారు. అయితే.. పక్కా ప్లాన్‌తోనే ఆమె ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. కేవలం పాఠశాలను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె వద్ద మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. దీంతో ఆమె మరిన్ని దాడులకు ప్లాన్ చేసి ఉండొచ్చునని ఓ అధికారి చెప్పారు.
ఈ ఘటనపై వైట్‌హౌజ్ స్పందించింది. హృదయవిదాకరమైన ఘటన అని తెలిపింది. ఇదిలా ఉంటే అమెరికాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. గతేడాది టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ఇద్దరు మరణించారు.