ట్యునిషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెలుతున్న పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 57 మంది మరణించారు. మరో 33 మందిని మాత్రం చమురు ఓడల సిబ్బంది కాపాడారు. ట్యునిషియా నైరుతి తీరంలోని ఎస్‌ఫాక్స్ వద్ద మధ్యధరా సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాతావరణం కాస్త మెరుగుపడడంతో ట్యునిషియా, లిబియా నుంచి యూరప్ వైపు వలసలు పెరిగాయి.
ఈ క్రమంలో లిబియాలోని జవారా నుంచి 90 మంది వలసదారులతో ఐరోపా వైపు ఓ పడవ బయలుదేరింది. అయితే.. ఎమైందో తెలీదు కానీ.. ట్యునిషియా నైరుతి తీరంలోని ఎస్‌ఫాక్స్ చేరుకునే సరికి పడవ మునిగిపోయింది. ఘటనలో 57 మంది మృతి చెందగా.. 33 మంది ప్రాణాలతో బయటపడినట్లు రెడ్ క్రెసెంట్ అధికారి మొంగి స్లిమ్ తెలిపారు. ప్రాణాలతో బయట పడిన వారంతా బంగ్లాదేశీయులేనని చెప్పారు. కాగా.. మరణించిన వారు ఏ దేశస్థులు అన్నది ఇంకా తెలియరాలేదు.
కాగా.. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం మీదుగా వలస వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది ఇటలీ, స్పెయిన్, ట్యునిషియా, అల్జీరియాకు చెందిన వారేనన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 633 మంది మరణించగా.. చాలా మంది గల్లంతయ్యరని ఏజెన్సీ చెప్పింది.