బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. తాజా హింసాకాండలో 27 మందికి పైగా మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. స్టన్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించారు. దీంతో అల్లర్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి నిరవధిక దేశవ్యాప్త కర్ఫ్యూను ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు రాజధాని ఢాకాను కూడా తాకాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం 200 మంది బలయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఉన్న విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిచ్చారు. ప్రజలు పన్నులు, యుటిలిటీ బిల్లులు చెల్లించవద్దని కోరారు. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్శిటీతో సహా, పలు కార్యాలయాలు, సంస్థలపై నిరసనకారులు దాడి చేశారు. అనేక వాహనాలను కూడా తగులబెట్టారు.