దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ మురికివాడలో మంటలు చెలరేగడంతో దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
600 పైగా నివాసాలు ఉన్న దక్షిణ సియోల్‌లోని గుర్యోంగ్ గ్రామంలో శుక్రవారం ఉదయం 6.27 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దాదాపు 290 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 హెలికాప్టర్లు, అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు.
1,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 40 ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ ఘటనపై స్పందించారు. సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించాలని అధికారులకు సూచించారు. మంటలను అదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలన్నారు.
ఇంటీరియర్ మినిస్టర్ లీ సాంగ్-మిన్ కూడా సెకండరీ డ్యామేజ్‌ను నివారించాలని, సమీప ప్రాంతాల నివాసితులను రక్షించాలని అధికారులను ఆదేశించారని మంత్రిత్వ శాఖ తెలిపింది.