నైజీరియాలో కాల్పుల క‌ల‌క‌లం.. 43 మంది మృతి

43 people killed in gunmen attack in North-Western Nigeria.అచ్చం సినిమాల్లో చూపించే విధంగానే.. ఓ 200 మంది దుండ‌గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 6:55 AM GMT
నైజీరియాలో కాల్పుల క‌ల‌క‌లం.. 43 మంది మృతి

అచ్చం సినిమాల్లో చూపించే విధంగానే.. ఓ 200 మంది దుండ‌గులు బైక్‌పై ఓ ర‌ద్దీగా ఉన్న మార్కెట్‌కు వ‌చ్చారు. మార్కెట్ గేట్‌ను విర‌గొట్టి లోనికి ప్రవేశించారు. క‌నిపించిన‌ వారిపై తుపాకీల‌తో కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 43 మంది మృతి చెంద‌గా.. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న నైజీరియా దేశంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తర నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలోని గోరోనియో ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో ప్ర‌తి ఆదివారం వారాంత‌పు సంత ఉంటుంది. ఎప్ప‌టిలాగానే ఆదివారం(అక్టోబ‌ర్ 17)న సంత ప్రారంభ‌మైంది. సుమారు 200మందితో ఉన్న బందిపోట్ల ముఠా బైక్‌ల‌పై మార్కెట్‌కు వ‌స్తూనే గేట్ల‌ను విర‌గొట్టి సినిమా స్టైల్‌లో కాల్పుల‌తో రెచ్చిపోయారు. ఆడ‌, మ‌గ అన్న తేడా లేకుండా క‌నిపించిన వారిపై కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. తుపాకీల మోత‌తో ఆప్రాంతం హోరెత్తింది. ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని త‌లోదిక్కున పారిపోయి దాక్కుతున్నారు.

ఆదివారం ప్రారంభ‌మైన ఈ మార‌ణ‌హోమం సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు కొన‌సాగింద‌ని సోకోటో గ‌వ‌ర్న‌ర్ అమీను వ‌జిరి తాంబూవ‌ల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 43 మంది చ‌నిపోయిన‌ట్లు వెల్ల‌డించారు. చాలా మంది తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ఆదేశించిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై అక్క‌డి లోక‌ల్ మీడియా క‌వ‌ర్ చేయ‌డంతో ప్ర‌పంచానికి ఈ విష‌యం తెలిసింది. తొలుత 30మంది చనిపోగా.. 20మందికి తీవ్రగాయాలైనట్లు మీడియా తెలుప‌గా.. 43 మంది చ‌నిపోయిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

సుమారు 200 మంది మార్కెట్​లోకి వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చున‌ని వారు అంటున్నారు. కాగా.. నైజీరీయాలో ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్యం. అక్టోబర్‌8న కూడా ఓ మార్కెట్‌లో బందిపోట్లు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో 19మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story