అప్గాన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడి.. ఆసుపత్రి ధ్వంసం, 400 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మత్తుపదార్థాల బారిన పడిన వారికి చికిత్స అందించే ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో...
By - అంజి |
అప్గాన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడి.. ఆసుపత్రి ధ్వంసం, 400 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మత్తుపదార్థాల బారిన పడిన వారికి చికిత్స అందించే ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో 400 మంది మృతి చెందారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిలోని మెజారిటీ భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఉన్నట్లు సమాచారం.
ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దారుణం జరగడంపై అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద తల్లులు తమ కుమారుల పేర్లు పిలుస్తూ రోదిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ చేస్తున్న ఇటువంటి దాడులను సహించబోమని అఫ్గాన్ పాలకులు హెచ్చరించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను, ఆయుధ గిడ్డంగులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, ఆసుపత్రిని లేదా పౌర ప్రాంతాలపై దాడి చేయలేదని పాక్ సమాచార శాఖ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని పాక్ ప్రధాని ప్రతినిధి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం, ఇరు దేశాల మధ్య కాల్పులు జరగడం వల్ల ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉగ్రవాద నియంత్రణకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది.