స్టేడియంలో మ్యాచ్‌.. బ‌య‌ట కాల్పులు.. న‌లుగురి మృతి

4 people shot outside baseball stadium in US capital.అమెరికాలో మ‌రోసారి కాల్పులు క‌ల‌కలం సృష్టించాయి. రాజ‌ధాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 5:28 AM GMT
స్టేడియంలో మ్యాచ్‌.. బ‌య‌ట కాల్పులు.. న‌లుగురి మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పులు క‌ల‌కలం సృష్టించాయి. రాజ‌ధాని వాషింగ్టన్‌ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. నేషనల్‌ పార్క్‌లోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందిన‌ట్లు అధికారులు చెప్పారు. ఆ సమయంలో స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు.

దక్షిణ వాషింగ్టన్‌ డిసిలోని నేవీ యార్డ్‌ పరిసరాల్లోని నేషనల్‌ పార్క్‌ బేస్‌బాల్‌ స్టేడియంలో శనివారం వాషింగ్టన్‌ నేషనల్స్‌, సాన్‌డియాగో జట్ల మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. స్టేడియం ప్రేక్ష‌కుల‌తో కిక్కిరిసిపోయింది. మ్యాచ్ సాగుతున్న స‌మ‌యంలో స్టేడియం వెలుప‌ల గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులకు పాల్ప‌డ్డారు. కాల్పుల శ‌బ్దాలు విన్న స్టేడియంలోని ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు లోన‌య్యారు. కొద్ది సేప‌టి వ‌ర‌కు ఎవ‌రికి ఏమీ జ‌రిగిందో అర్థం కాలేదు. కొద్ది మంది స్టేడియం వెలుప‌ల‌కు ప‌రుగులు తీయ‌గా..ఆట‌గాళ్లు పిచ్‌ను వ‌దిలి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో అధికారులు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని.. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని స్టేడియంలోనే ఉండాలంటూ.. మైదానంలోని తెర‌పైన ప్ర‌ద‌ర్శించారు.


కాగా.. ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు ట్వీట్‌ చేశారు. బుల్లెట్‌ గాయాలైన నలుగురితో పాటు మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించామన్నారు. వీరిలో న‌లుగురు మృతి చెందార‌ని.. మ‌రో ఇద్ద‌రు చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. కాల్పులు జరిగిన థర్డ్‌ బేస్‌ గేట్‌ కూడలిని మూసివేశామని, పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. కాల్పులు జ‌రిపిన‌ దుండ‌గుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా.. కాల్పుల శ‌బ్దాలు విని ప‌లువురు మైదానంలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీస్తున్న దృశ్యాలను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

Next Story