మయన్మార్ లో పాలన పగ్గాలను సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుండి ఆ దేశం అట్టుడుకుతోంది. ప్రపంచదేశాలు సైనిక చర్యను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై సైన్యం కక్షగట్టింది. ఆందోళనకారులపై తుపాకీని ఎక్కుపెట్టింది. గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బంది, కవరేజీలో ఉన్న విలేకరులపైనా దాడి చేస్తోంది. బుధవారం రోజు ఫేస్‌బుక్, స్థానిక మీడియా బయట పెట్టిన ఆధారాల మేరకు పోలీసులు 38 మంది ఆందోళనకారులను కాల్చి చంపారు.
బుధవారం ఉదయం 9 గంటలకు పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తుండగా.. సైనికులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే గన్స్‌తో కాల్పులు జరిపారు. ఒక్క యాంగాన్‌లోనే 18 మంది మృతిచెందినట్లు సోషల్‌మీడియా, స్థానిక మీడియాలో చెబుతూ ఉన్నారు. మాండలే, మోన్యవా నగరాల్లో జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు మృతిచెందారు. ఐక్యరాజ్య సమితి మయన్మార్ లో చోటు చేసుకున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆందోళనలతో సంబంధం లేని వారిపైనా పోలీసులు దాడిచేసినట్లు చెబుతున్నారు.