బుర‌ద‌లో కూరుకుపోయిన బ‌స్సు.. 34 మంది స‌జీవ స‌మాధి.. మృతుల్లో 8 మంది చిన్నారులు

34 Killed As Landslide Swallows Bus On Highway.కొలంబియాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Dec 2022 2:24 PM IST
బుర‌ద‌లో కూరుకుపోయిన బ‌స్సు.. 34 మంది స‌జీవ స‌మాధి.. మృతుల్లో 8 మంది చిన్నారులు

కొలంబియాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ‌డంతో ర‌హ‌దారిపై వెలుతున్న ఓ బ‌స్సును పూర్తిగా ముంచేసింది బుర‌ద‌. ఈ దుర్ఘ‌ట‌న‌లో 34 మంది మ‌ర‌ణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్న‌ట్లు జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం తెలిపింది. ఈ ఘ‌ట‌న రాజ‌ధాని బొగోటాకు 230 కి.మీ దూరంలోని రిస‌రాల్డా ప్రావిన్సులోని ఫ్యూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మ‌ధ్య జ‌రిగింది.

కొద్ది రోజులుగా కొలంబియాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా కొండ ప్రాంతాల్లోని మ‌ట్టి దిబ్బ‌లు విరిగిప‌డి బుర‌ద‌గా మారుతున్నాయి. ఆదివారం సాయంత్రం బుర‌ద ఉప్పొంగ‌డంతో ఫ్యూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మ‌ధ్య ర‌హ‌దారి రెండుగా చీలిపోయింది. అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న బ‌స్సును బుర‌ద ముంచెత్తింది. రెండు మీట‌ర్ల లోతులో బ‌స్సు కూరుకుపోయింది. ఓ కారులోని ఆరుగురు వ్య‌క్తులు, బైక్‌పై వ‌స్తున్న ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

స‌మాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. 70 మంది సిబ్బంది 24 గంట‌ల పాటు శ్ర‌మించి బ‌స్సులోంచి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. ఈ ఘ‌ట‌న‌పై కొలంబియా అధ్య‌క్షుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు. భారీ వర్షాల కారణంగా పట్టణం బురద ముప్పులో ఉందని కొలంబియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.

Next Story