తవ్వకాల్లో బయట పడ్డ నగరం

3000 Year Golden City unearthed in egypt.ఒకప్పుడు అంటే సుమారు 3 వేల ఏళ్ల క్రితం అక్కడో నగరం ఉండేది.. ఇసుక కింద సమాధి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 8:56 AM GMT
తవ్వకాల్లో బయట పడ్డ నగరం

ఒకప్పుడు అంటే సుమారు 3 వేల ఏళ్ల క్రితం అక్కడో నగరం ఉండేది.. ఇసుక కింద సమాధి అయిపోయిన ఆ నగరాన్ని గుర్తించడం కోసం ఎన్నో దేశాలకు చెందిన ఎంతో మంది పురాతత్వవేత్తలు ఎన్నో తవ్వకాలు చేపట్టారు. ఫలితం లేకపోయింది. కానీ, ఈజిప్ట్ సైంటిస్టులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ నగరం పేరు 'అటెన్'.

వేల ఏళ్లవుతున్నా ఆ నగరపు గోడలు చెక్కు చెదరలేదు. బేకరీ, సమాధులు, నివాస సముదాయాలను గుర్తించిన శాస్త్రవేత్తలు టుటెంకమిన్ సమాధిని తర్వాత ఇది అతి ముఖ్యమైన వెలికితీత అని చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాలను ప్రముఖ చరిత్రకారుడు, పురాతత్వవేత్త జాహీ హవాస్ వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలోని పురాతత్వవేత్తల బృందం ఈ నగరాన్ని గుర్తించింది.

రాజుల లోయగా పిలిచే లగ్జర్ కు దగ్గర్లో గుర్తించిన ఈ నగరం ఎమెనోటెప్ 3 కాలానికి చెందినది. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో నగరంతో పాటు ఎన్నో ఆభరణాలు, బీటిల్ పురుగులకు సంబంధించిన ఆనవాళ్లు, మట్టి ఇటుకలను వెలికి తీశారు. ఆ ఇటుకలపై ఎమెనోటెప్ 3 చిత్రాలు ముద్రించి ఉన్నట్టు పురాతత్వవేత్తలు గుర్తించారు. నివాస సముదాయాల్లోని ఇళ్లలో ప్రజలు నిత్యం వాడే పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, పూలు పెట్టుకునే వాజులు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు.


గత ఏడాది సెప్టెంబర్ లో రామ్సెస్ 3, ఎమెనోటెప్ 3కి సంబంధించిన గుళ్ల మధ్య తవ్వకాలు మొదలుపెట్టారు. కేవలం వారం వ్యవధిలోనే నగరాన్ని గుర్తించామన్నారు. చాలా చోట్ల ఇటుకలతో కూడిన నిర్మాణాలు బయటకు కనిపించాయని, తవ్వకాలను మరింత చేపట్టగా నగరం వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు.

కాగా, యూఫ్రేట్స్ నుంచి సూడాన్ వరకు ఎమెనోటెప్ 3 పాలించాడని, క్రీస్తు పూర్వం 1354లో చనిపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ ప్రాంతాన్ని పాలించాడని, ఎన్నో కట్టడాలను నిర్మించాడని అంటారు. లగ్జర్ కు సమీపంలో ఎమెనోటెప్ 3, అతడి భార్యకు సంబంధించిన రెండు భారీ రాతి విగ్రహాలను నిలబెట్టించాడు. దానినే కొలోజీ ఆఫ్ మెమ్నన్ అని పిలుస్తుంటారు.





Next Story