రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ మిలిటరీ విమానం కుప్పకూలింది. అంటోనోవ్-26 (An-26) మిలిటరీ విమానం క్రిమియా ద్వీపకల్పం మీదుగా ప్రయాణిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 29 మంది మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ టాస్ (TASS) వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది.
రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 31వ తేదీ సాయంత్రం మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో, క్రిమియా మీదుగా షెడ్యూల్డ్ ఫ్లైట్‌లో ఉన్న ఈ సైనిక రవాణా విమానంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించారు.
ప్రాథమిక విచారణలో విమానంపై ఎటువంటి బాహ్య దాడులు జరిగినట్లు ఆధారాలు లభించలేదని రక్షణ శాఖ పేర్కొంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం, సాంకేతిక లోపం (Technical Failure) కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.