కరోనా టీకా తీసుకున్న 23 మంది వృద్ధుల మృతి

23 die in Norway after receiving Pfizer COVID-19 vaccine.కొవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్దులు ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 4:51 AM GMT
కరోనా టీకా తీసుకున్న 23 మంది వృద్ధుల మృతి

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే.. కొన్ని చోట్ల ఈ టీకాలు తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ని వార్త‌లు చూస్తునే ఉన్నాం. తాజాగా కొవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్దులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న నార్వే దేశంలో చోటుచేసుకుంది.

నార్వేలో కొవిడ్-19 ఫైజర్ తొలి డోసు తీసుకున్న కొద్దిసేప‌టికే 23 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. 80 ఏళ్ల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తే వారిలో ప్రతికూల చర్యలు కనిపించాయని.. 23 మంది వృద్ధులు కరోనా టీకా వేయించుకున్న కొద్దిసేపటికే మరణించారని వైద్యులు తెలిపారు. మ‌రీ బ‌ల‌హీనంగా ఉన్న వృద్ధులు సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని భావిస్తున్నారు. ఏమాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధుల‌కు టీకా ఇస్తే, వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న‌ట్లు గుర్తించారు. అతి త‌క్కువ జీవిత‌కాలం ఉన్న‌వారిలో టీకా వ‌ల్ల లాభం పెద్ద‌గా ఉండ‌ద‌ని.. వారికి టీకా అన‌వ‌స‌రం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్య‌క్తం చేసిం‌ది. ఆరోగ్య‌వంతులు, యువ‌కులు టీకాను తీసుకోవ‌చ్చు అని నార్వే ప్ర‌భుత్వం చెప్పింది.

టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు టీకాలు వేయకుండా ఉండాలని నార్వేజియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇప్పుడు హెచ్చరిక జారీ చేసింది. వృద్ధుల మృతి ప‌ట్ల ఫైజ‌ర్‌, బ‌యోఎన్‌టెక్ కంపెనీ విచార‌ణ చేప‌డుతున్న‌ది. టీకా వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంద‌ని ఫైజ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. నార్వేలో డిసెంబరు చివరి నుంచి ఇప్పటివరకు 30,000 మందికి ఫైజర్, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.




Next Story