విషాదం.. కాలువ‌లోకి దూసుకుపోయిన మినీబ‌స్సు.. 22 మంది మృతి

22 Killed as Minibus falls into canal in Egypt.ప్ర‌మాదవ‌శాత్తు బ‌స్సు కాలులో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది మ‌ర‌ణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 9:09 AM IST
విషాదం.. కాలువ‌లోకి దూసుకుపోయిన మినీబ‌స్సు.. 22 మంది మృతి

ఈజిప్టు దేశంలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదవ‌శాత్తు బ‌స్సు కాలులో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న నైలు నది డెల్టా ప్రాంతంలో కైరో రాజధానికి ఈశాన్యంగా 100 కిలోమీటర్ల (62 మైళ్లు) దూరంలో ఉన్న దకాహ్లియా ప్రావిన్స్‌లో శనివారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నార‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి డాక్టర్ షెరీఫ్ మకీన్ తెలిపారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు.

బ‌స్సు డ్రైవ‌ర్ స్టీరింగ్‌పై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండ‌వ‌చ్చున‌ని ప్రావిన్స్‌లోని పోలీసు పరిశోధనల అధిపతి అబ్దెల్‌ హదీ అన్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మృత‌దేహాల‌ను నీటి నుంచి బ‌య‌ట‌కు తీసేందుకు పోలీసులకు స్థానికులు సాయం చేస్తున్న‌ట్లు ఆ వీడియోల్లో ఉంది. కాగా.. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 46 మంది ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈజిప్టులో ప్రతి సంవత్సరం అధిక సంఖ్య‌లో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌మాదాల కార‌ణంగా వేలాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఈ ఏడాది జూలైలో మిన్యా దక్షిణ ప్రావిన్స్‌లోని హైవేపై ప్రయాణీకుల బస్సు ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది, ఈ ప్ర‌మాదంలో 23 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. అక్టోబర్‌లో డకాహ్లియాలో మినీబస్సుపైకి ట్రక్కు దూసుకుపోయింది, కనీసం 10 మంది మరణించారని అధికారులు తెలిపారు.

Next Story