ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి

ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్‌లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత పేరును ప్రకటించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 10 Oct 2025 9:00 AM IST

Interantional News, Nobel Peace Prize, US President Donald Trump

 ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి

ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్‌లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత పేరును ప్రకటించనున్నారు. ఇటీవలి కాలంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూసే నోబెల్ శాంతి బహుమతి ఇదే కావచ్చు. కారణం – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత మూడు నెలలుగా ఈ బహుమతి కోసం బహిరంగ ప్రచార యత్నం ప్రారంభించడమే.

గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన సభలోనూ, వివిధ సందర్భాలలో కనీసం పది సార్లు ట్రంప్ తనను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా “ఆరు నుంచి ఏడు యుద్ధాలను” తాను ముగించానని, అందులో భారత్–పాకిస్తాన్ మధ్య వివాదమూ ఉందని ప్రకటించారు. “వేల ఏళ్లుగా కొనసాగిన యుద్ధాలు, మిలియన్ల ప్రాణాలు పోయే స్థితి”ని తానే నివారించానని ఆయన తరచూ చెప్పడం గమనార్హం.

ట్రంప్ ప్రకారం, ఈ పరిష్కారాలు తాను చూపిన వ్యక్తిగత దౌత్య నైపుణ్యం, సుంకాల బెదిరింపులు, సైనిక ఒత్తిడి లేదా అమెరికా మధ్యవర్తిత్వం వల్ల సాధ్యమయ్యాయని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు కూడా ట్రంప్ నామినేషన్‌ను మద్దతు పలికాయి. జూన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్‌ను ప్రాంతీయ స్థిరత్వానికి చేసిన కృషికి నామినేట్ చేస్తూ లేఖ పంపగా, జూలైలో నేతన్యాహు కూడా ట్రంప్‌కు మద్దతు లేఖ సమర్పించారు.

ట్రంప్ వ్యాఖ్యలు

వైట్ హౌస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, “నాకు తెలియదు… మార్కో (రుబియో) చెప్పినట్లయితే మేము ఏడు యుద్ధాలను ముగించాం. ఎనిమిదోది కూడా సమీపంలో ఉంది. రష్యా పరిస్థితినీ మేము పరిష్కరిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఇంత చేయలేదు. అయితే నన్ను ఎలాగైనా తప్పిస్తారేమో చూద్దాం,” అన్నారు. అయితే ట్రంప్‌కు ఈ ఏడాది బహుమతి రావడానికి ప్రధాన ఆటంకం ఉంది — నామినేషన్లు జనవరి 31తో ముగిశాయి, అంటే ఆయన వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టిన వారం తరువాతే.

ట్రంప్ క్లెయిమ్‌ల వాస్తవం

ట్రంప్ పేర్కొన్న “ఏడు యుద్ధాల్లో” వాస్తవానికి ఆయుధపూరిత ఘర్షణలు నాలుగు మాత్రమే – ఇజ్రాయెల్–ఇరాన్, భారత్–పాకిస్తాన్, ఆర్మేనియా–అజర్‌బైజాన్, రువాండా–కాంగో. మిగిలిన ఈజిప్ట్–ఇథియోపియా నైల్ నది వివాదం, సెర్బియా–కోసోవో సమస్యలు యుద్ధస్థాయిలో లేవు. అయినప్పటికీ, నాలుగు అమెరికా అధ్యక్షులు — వుడ్రో విల్సన్, టెడీ రూసవెల్ట్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా — నోబెల్ శాంతి బహుమతిని పొందిన జాబితాలో చేరేందుకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. వారిలో ఒబామాకు 2009లో వచ్చిన బహుమతి అత్యంత వివాదాస్పదం. ఆ సమయంలో అమెరికా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో ఉన్నప్పటికీ, “ముస్లిం ప్రపంచంతో కొత్త వాతావరణం సృష్టించినందుకు” ఆయనకు బహుమతి ఇచ్చారు.

Next Story