రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఇరగోంగో అనే ఒక పురాతన అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన సంగతి తెలిసిందే. శనివారం ఈ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో లావా ఉప్పొంగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించగా.. సుమారు 170 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని యూనిసెఫ్(ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్) తెలిపింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా వెలువడుతుండడంతో.. దానిచుట్టుపక్కల ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరింది. ఆ నగరంలోని వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి.
లావా భయంతో ప్రజలు నగరాన్ని విడిచి.. సురక్షిత ప్రాంతాలకు వెలుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 8 వేల మందికి పైగా రువాండాలోకి వచ్చారని.. రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం విస్పోటనం తర్వాత 11 మంది మృతి చెందగా.. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ వేరే ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఐదుగురు మృతి చెందారు. క్యాంప్ మున్జెంజ్ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో నలుగురు ఖైదీలు సైతం మరణించారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఎన్‌ఆర్‌సీ అంచనా ప్రకారం.. గోమా చుట్టూ సుమారు 600 గృహాలు, ఐదు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉండగా, గోమా నగర వీధులను లావా ముంచెత్తింది. దట్టమైన పొగ అలముకుంది. కాగా.. 1977 లో ఇదే పర్వతం విస్ఫోటన వల్ల సుమారు 6 వందల మంది మరణించారు. అలాగే 2002లో జరిగిన విస్పోటనలో సుమారు 3 వందల మంది మృతి చెందారు.