వారంతా పొట్ట చేత బట్టుకుని ఓ నౌకలో వలస వెలుతున్నారు. అయితే.. ఆ నౌకలోనే కొందరు స్మగ్లర్లు ప్రయాణిస్తున్నారు. నౌక సామర్థ్యానికి మించి అందులో ప్రయాణిస్తున్నారు. ఆ విధంగా ప్రయాణిస్తే.. వారితో పాటు తాము మునిగిపోతామని బావించిన స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. వలస కార్మికుల్లో 80 మందిని నౌక నుంచి సముద్రంలోకి తోసేసారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ దారుణ ఘటన తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) వెల్లడించిన వివరాల మేరకు.. తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి నుంచి యెమెన్‌కు దాదాపు 200 మంది ఓ నౌకలో బుధవారం తెల్లవారుజామున బయలుదేరారు. వీరిలో దొంగతనంగా సరుకు రవాణా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నారు. అయితే.. నౌక సామర్థ్యానికి మించి ఎక్కువ మంది నౌకలో ఉండడంతో కొంత దూరం వెళ్లిన తరువాత స్మగ్లర్లు 80 మంది వలసదారులను సముద్రంలోకి తోసేశారు. వీరిలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. 60మంది సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. 20 మందిలో ఐదు మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకు వెలికితీయగా.. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. సముద్రాన్ని ఈదుకుంటూ ప్రాణాలతో బయట పడిన 60 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.