పేలిన ఇంధన ట్యాంకర్.. 20 మంది మృతి.. 79 మందికి తీవ్రగాయాలు
20 killed in fuel tanker explosion in Lebanon.ఉత్తర లెబనాన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 15 Aug 2021 1:54 PM ISTఉత్తర లెబనాన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో 20 మందికిపైగా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. కాగా.. వారిలో పలువురి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు లెబనాల్ రెడ్ క్రాస్ సంస్థ వెల్లడించింది. కాగా.. పేలుడు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాదంపై లెబనాల్ ఆరోగ్య మంత్రి హమద్ హసన్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఉత్తర లెబనాల్ మరియు బీరుట్‌లోని అన్ని ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి చికిత్స అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో 200 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదిలా ఉంటే.. లెబనాల్‌లో తీవ్ర ఇంధన కొరత ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
డీజిల్, పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున గొడవలు చెలరేగుతుండడంతో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ట్యాంకర్లను, పెట్రోల్ బంకులను లెబనాల్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఓ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న సైనికులు ఇంధనాన్ని పంపిణీ చేస్తుండగా ఈ ఘటన సంభవించింది.