ఎయిర్ షోలో అప‌శృతి.. ఆకాశంలో ఢీ కొన్న యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి..!

2 Fighter Planes Collide During US Airshow 6 Feared Dead.ఎయిర్ షోలో అప‌శృతి చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 3:13 AM GMT
ఎయిర్ షోలో అప‌శృతి.. ఆకాశంలో ఢీ కొన్న యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి..!

ఎయిర్ షోలో అప‌శృతి చోటు చేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న స‌మ‌యంలో ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘోర ప్ర‌మాదం అగ్ర‌రాజ్యం అమెరికాలోని డ‌ల్లాస్‌లో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో వైమానిక ప్ర‌ద‌ర్శ‌న‌(ఎయిర్ షో) నిర్వ‌హించారు. బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్‌కోబ్రా యుద్ధ విమానాలు స్థానిక కాల‌మానం ప్ర‌కారం మధ్యాహ్నం 1:20 గంటలకు ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

పెద్ద శ‌బ్ధంతో విమానాలు కుప్ప‌కూలిపోయాయి. మంట‌లు చెల‌రేగాయి. వైమానిక ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించేందుకు వ‌చ్చిన వారు ఈ ప్ర‌మాదంతో దిగ్భ్రాంతికి గుర‌య్యారు. కాగా., ఈ వైమానిక ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు, మైదానంలో ఉన్న వారికి ఎటువంటి గాయాలు అయిన‌ట్లు నివేదిక‌లు లేవు.

ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణిచారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) విచారణకు ఆదేశించాయి.

ప్ర‌మాదానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story