ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 92 మంది సైనికులతో వెలుతున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు మృతి చెందగా.. మరో 40 మందిని రక్షించారు. ఇంకా 35 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు 40 మంది జవాన్లను రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ చీప్ సిరిలిటో సొబెజనా తెలిపారు.
17 మంది మృతి చెందగా.. మిగతా వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వేను చేరుకోవడంతో విమానం విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సొబెజనా తెలిపారు. విమానంలో ఉన్న వారంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లనిసమాచారం. ఉగ్రవాదంపై పోరు కోసం ఏర్పాటు చేసిన సంయుక్త కార్యదశంలో వీరిని చేర్చేందుకు విమానంలో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.