Bus Falls into Ditch : ఘోర ప్రమాదం.. కాలువలో పడ్డ బస్సు.. 17 మంది మృతి
బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 2:00 PM ISTకాలువలో పడిపోయిన బస్సు
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు.
ప్యాసింజర్ బస్సు పద్మా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నుంచి ఢాకా వెళుతోంది. ఉదయం 7.30 గంటలకు మదరిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై వెలుతున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు మదరిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎండీ మసూద్ ఆలం తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బావిస్తున్నట్లు చెప్పారు.
ఫరీద్‌పూర్‌లోని అగ్నిమాపక శాఖ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ షిప్లు అహ్మద్ మాట్లాడుతూ.. వేగంగా వెళ్తున్న క్రమంలో బస్సు టైరు పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. పై నుంచి కిందపడడంతో బస్సు చాలా భాగం దెబ్బతింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. మృతుల వివరాలను గుర్తించాల్సి ఉన్నట్లు చెప్పారు.