కాబుల్ పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న 160 మంది
160 Afghan Sikhs And Hindus Safe After Narrowly Escaping Kabul Blasts.కాబుల్‌లోని హమీద్ కర్ణాయ్ అంతర్జాతీయ
By తోట వంశీ కుమార్
కాబుల్‌లోని హమీద్ కర్ణాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జంట పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 103 మంది చనిపోయారు. 13 మంది అమెరికా సైనికులు చనిపోగా.. 90 మంది అఫ్గాన్ ప్రజలు మరణించారు. 150 మందికి పైగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పేలుళ్ల నుంచి తృటిలో 160 మంది తప్పించుకున్నారు. ఎక్కడైతే పేలుడు సంభవించిందో సరిగ్గా అదే ప్రాంతంలో నిన్న వీరు మంది ధర్నా చేశారు.
తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకోవడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు, అక్కడ నివసిస్తున్న విదేశాలు దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీరిలో 145 మంది సిక్కులు కాగా.. మరో 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడ వీరిని తాలిబన్లు అడ్డుకున్నారు.
All the minorities who have taken refuge in Gurdwara Karte Parwan are safe#Kabulairport #KabulBlast @thetribunechd @republic @punjabkesari @indiatvnews @ANI @PTI_News https://t.co/2gSdBg50x8
— Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021
అన్ని పత్రాలు ఉన్నప్పటికి తాలిబన్లు అడ్డుకోవడంతో వీరంతా అక్కడే ధర్నాకు దిగారు. ఎంత సేపు ఉన్న లోనికి అనుమతించమని తాలిబన్లు తేల్చిచెప్పడంతో చేసేది ఏమీ లేక అంతకముందు తాము ఆశ్రయం పొందిన గురుద్వారా కార్టె పర్వాన్‌కు చేరుకున్నారు. కాగా.. వీరు ఏ ప్రదేశంలో అయితే కొన్ని గంటలపాటు ఎదురుచూశారో సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ విషయాన్ని కాబుల్ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు గుర్నం సింగ్ తమకు తెలిపినట్లు అకాలీ దళ్ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ సీర్సా తెలిపారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.