యూరప్‌లోని మాంటినిగ్రో దేశంలో కాల్పుల కలకం రేగింది. ఓ వ్యక్తి వీధుల్లోకి వచ్చి అక్కడున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. అనంతం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మృతి చెందాడు. మొదట కుటుంబంతో గొడవ పడిన దుండగుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వీధిలోకి వచ్చి అక్కడ కనిపించిన వారందరిపై కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో చిన్న పిల్లలు సహా 11 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. మాంటినిగ్రో దేశ రాజధాని పొడిగ్రాకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటెంటీ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాంటినిగ్రో పోలీస్ చీఫ్ జోరన్ బ్రేనిన్ చెప్పిన వివరాల ప్రకారం.. అనుమానిత దుండగుడు మొదట తన ఇంట్లో అద్దెదారులుగా నివసిస్తున్న కుటుంబంపై దాడి చేశాడు. ఆ కుటుంబంలోని 8, 11 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ పిల్లల తల్లిని గాయపరిచాడు. తీవ్రగాయాలతో ఆ తల్లి మరణించింది. ఆ వెంటనే అతను వీధిలోకి వెళ్లి రైఫిల్‌తో ఇతర ప్రజలను కాల్చాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి వీధి గుండా వెళుతున్న వ్యక్తులను విచక్షణారహితంగా కాల్చిచంపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో ఉన్నారని మోంటెనెగ్రో క్లినికల్ సెంటర్ హెడ్ లిజిల్జానా రాడులోవిక్ తెలిపారు. మోంటినెగ్రో ప్రెసిడెంట్ మిలో డుకనోవిక్.. మృతులకు సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ బాధ సమయంలో మనమందరం చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావంగా నిలబడాలి అని పేర్కొన్నారు.