ఘోర ప్రమాదం.. మినీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 11 మంది దుర్మరణం
11 Dead after train rams into microbus at railway crossing in Bangladesh.పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీ
By తోట వంశీ కుమార్
పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.
అమన్ బజార్ ప్రాంతంలో ఉన్న 'ఆర్ అండ్ జే ప్లస్' అనే కోచింగ్ సెంటర్‌కు చెందిన కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు మినీ బస్సులో మిర్షారాయ్ కొండలపై ఉన్న ఖోయాచోరా జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. జలపాతం వద్ద ఎంతో ఆనందంగా గడిపిన తరువాత తిరుగు ప్రయాణం అయ్యారు. చటోగ్రామ్ జిల్లాలోని రైలు క్రాసింగ్ వద్ద పట్టాతున్న వీరి వాహనాన్ని ఢాకా వెళ్లే ప్రోభాతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. సుమారు కిలో మీటర్ దూరం వరకు మినీ బస్సును రైలు ఈడ్చుకు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ఛటోగ్రామ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు హతజారీ ఉపజిల్లా నిర్బాహి అధికారి (UNO) షాహిదుల్ ఆలం తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వే అధికారులు రైల్వే డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (తూర్పు ప్రాంతం) అన్సార్ అలీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రైల్వే జనరల్ మేనేజర్ జహంగీర్ హుస్సేన్ (తూర్పు ప్రాంతం) ధృవీకరించారు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీని కోరినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఖోయాచోరా రైల్ గేట్ కాపాలాదారు సద్దాం హుస్సేన్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు బావించడంతో అదుపులోకి తీసుకున్నారు.