నగదు విత్ డ్రా..మరింత భారం ?

By రాణి  Published on  15 Feb 2020 9:53 AM GMT
నగదు విత్ డ్రా..మరింత భారం ?

నగదు విత్ డ్రా చేసుకోవడం ఇకపై మరింత భారం కానుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటర్ ఛేంజ్ ఏటీఎంలలో నగదు విత్ డ్రా పై ఫీజులు పెంచాలని కోరుతూ..ఇండియా ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13వ తేదీన ఆర్బీఐ కి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర బ్యాంక్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా ఒక జాతీయ మీడియాలో కథనం వెలువడింది.

సాధారణంగా ఒక బ్యాంక్ కు చెందిన ఏటీఎం ను వేరే బ్యాంక్ ఏటీఎంలో వినియోగించినపుడు సదరు ఖాతాదారుడు ఆ బ్యాంక్ ఏటీఎం ఆపరేటర్ కు ఇంటర్ ఛేంజ్ ఫీజు చెల్లించాల్సిందే. ఈ ఫీజు చెల్లింపులు నెలకు ఐదు ట్రాన్సాక్షన్లు దాటితేనే చెల్లించాలి. 5 ట్రాన్సాక్షన్ల తర్వాత కూడా వేరే ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే రూ.15, బ్యాలెన్స్ ఎంక్వైరీలకు రూ.5 చొప్పున ఛార్జీలు వసూలు చేసేవారు.

ఇప్పుడు ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని, దీంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో తెలిపారు. ఖర్చు పెరగడంతో కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయలేకే..ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

పట్టణాల్లో ఇంటర్ ఛేంజ్ ఫీజు నగదు విత్ డ్రా లకు రూ.17, బ్యాలెన్స్ చెకింగ్ కు రూ.7 పెంచాలని ఏటీఎంల ఆపరేటర్ల సంఘం ఇచ్చిన లేఖలో పేర్కొంది. అలాగే ఉచిత ట్రాన్సాక్షన్లను మూడు వరకే పరిమితం చేయాలని కోరింది. గ్రామీణ, సెబీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ఫీజులు రూ.18,రూ.8కి పెంచుతూ..ఉచిత లావాదేవీలను ఆరుకు పెంచాలని సూచించింది. ప్రస్తుతం ఏటీఎంల ఆపరేటర్ల సంఘం ప్రతిపాదించిన అంశాలను కేంద్ర బ్యాంక్ పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఆర్బీఐ ఏటీఎంల ఆపరేటర్లు ప్రతిపాదించిన అంశాలు ఆమోదం పొందితే గనుక ఏటీఎం వినియోగదారుడిపై ఛార్జీల మోత తప్పదు.

Next Story