తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్..!

By రాణి  Published on  10 Feb 2020 5:45 AM GMT
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్..!

అమెజాన్.. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఈ టెక్ దిగ్గజం తెలంగాణలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించబోతోంది. అందుకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. హైదరాబాద్ నగర శివార్లలో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 90శాతంకు పైగా పెట్టుబడులను హై-ఎండ్ కంప్యూటర్స్, స్టోరేజ్ ఎక్విప్మెంట్ కోసం ఉపయోగించనున్నారు. ఈ రెండు డేటా సెంటర్ల ద్వారా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజన్ ను అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. ఒక డేటా సెంటర్ ను షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరొకటి కందుకూర్ మండలంలోని మీర్ఖాన్ పేట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

అమెజాన్ డేటా సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ADSIPL) ఈ రెండు డేటా సెంటర్ల కోసం జనవరి 31న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ADSIPL సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం చందనవెళ్లి గ్రామంలో 66,003 చదరపు మీటర్ల స్థలంలోనూ, మీర్ఖాన్ పేట్ లో 82,833 చదరపు మీటర్ల స్థలంలోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుపగా.. అందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లభించింది. ఈ రెండు చోట్లనే కాకుండా అమెజాన్ సంస్థ కోసం రంగారెడ్డి జిల్లా లోని రావిర్యాలలో కూడా స్థలాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే కాలంలో డేటా సెంటర్ మార్కెట్ భారత్ లో మరింత విస్తరించనుంది.. 2024లో 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటాకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో డేటా సెంటర్ల ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండడం, స్మార్ట్ డివైజ్ ల వాడకం కూడా పెరగడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు డేటా సెంటర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Next Story