విద్యార్థుల కోసం వినూత్న బాడీసూట్..!

By జ్యోత్స్న  Published on  25 Dec 2019 3:35 AM GMT
విద్యార్థుల కోసం వినూత్న బాడీసూట్..!

విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తదనాన్ని కోరుకుంటారు కొందరు టీచర్లు. స్పానిష్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు అలాగే ఆలోచించారు. శరీర భాగాల గురించి విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యేందుకు అంతర్గత భాగాలను సూచించే సూట్‌ వేసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన వినూత్న బోధనతో విద్యార్థులనే కాదు నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకున్నారు..

స్పానిష్‌కు చెందిన వెరోనికా డుకే అనే ఉపాధ్యాయురాలు 15 ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్నారు. ఆమె ఇంటర్నెట్‌లో శరీర అంతర్గత విడి భాగాలకు సంబంధించిన సూట్‌ ఒకటి చూశారు. విద్యార్థులకు శరీర భాగాల గురించి సులువుగా అర్థం చేయించేందుకు అది బాగా ఉపయోగపడుతుందని భావించి ఆమె దాన్ని కొనుగోలు చేశారు. అనంతరం పాఠశాలకు ఆ సూట్‌ వేసుకుని వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఆమె బోధించే మూడవ తరగతి విద్యార్థులయితే ఉత్సహంగా పాఠాలు విన్నారు.

నిజానికి శరీరంలోని అంతర్గత అవయవాలను ఊహించుకోవడం చాలా కష్టం. మనం తినే ఆహారం ఎలా జీర్ణం అవుతుందో చెప్పాలి అనుకుంటాం. కానీ ఫుడ్, ఎలా వెళుతుంది, ఎయిర్ ఎలా వెళుతుంది, అవిరెండూ కలిసిపోవా అని పిల్లలు అడిగితే చెప్పలేక తల పట్టుకు కూర్చుంటాం. అలాంటి డౌట్స్ అన్నీ ఈ సూట్ వేసుకున్నప్పుడు వెరోనికా చాలా ఈజీగా ఎక్సప్లయిన్ చేయగలిగారట. టీచర్తో పాటు వెళ్లిన ఆమె భర్త తరగతిలో ఆ సూట్‌తో బోధన చేస్తుండగా ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. పోస్ట్‌ చేసిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొద్ది క్షణాల్లోనే 13వేల రీట్వీట్లు, 66వేల మంది లైక్‌ చేశారు. తన చిన్నారి విద్యార్థుల కోసం వెరోనికా చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

Innovative Organ Bodysuit

Next Story
Share it