ఇన్ఫీ దూకుడు.. గంటలో రూ.50వేల కోట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 6:16 PM IST
ఇన్ఫీ దూకుడు.. గంటలో రూ.50వేల కోట్లు

భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంచనాలకు మించి రాణించింది. గురువారం ఆ కంపెనీ షేర్లు రాకెట్‌లా దూసుకుపోయాయి. 2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సంస్థ ప్రకటించగా.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. దీంతో సెషన్ ఆరంభంలోనే ఇన్వెసర్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. క్రితం ముగింపు రూ.831.45 వద్ద ముగిసిన ఈ షేర్ ఈ రోజు ఆరంభంలోనే రూ.900 వద్ద మొదలైంది. గంట సమయంలో ఏకంగా రూ.950కు చేరుకుంది. అప్పర్ లిమిట్ రూ.955 సమీపానికి చేరుకుంది.

ఆ తర్వాత ముగింపుకు ముందు 9.50 శాతం పెరుగుదలతో రూ.909.60 వద్ద నిలిచింది. కంపెనీ ధర ఓ సమయంలో ఏకంగా 15శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ అమాంతం రూ.50వేల కోట్లు పెరిగింది. అయితే అప్పర్ లిమిట్ (రూ.955)ను తాకుతుందని భావించినప్పటికీ ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు ఆసక్తి చూపించారు. ఇన్వెస్టర్ల పంట పండింది. దీంతో మధ్యాహ్నం గం.12.30 నుండి రూ.905 నుండి రూ.9.10కి మధ్య తచ్చాడింది.

కాగా, జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్ 11.5 శాతం నెట్ ప్రాఫిట్ వృద్ధిని నమోదు చేసి రూ. 4,233 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం సంస్థ నికరలాభం రూ. 3,798 కోట్లు మాత్రమే. ఇక, కొత్తగా 1.74 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ ను సంస్థ కుదుర్చుకుంది. కన్సాలిడేటెడ్ విధానంలో ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 8.5 శాతం పెరిగి రూ. 21,803 కోట్ల నుంచి రూ. 23,665 కోట్లకు పెరిగిందని సంస్థ పేర్కొంది.

కాగా, యూఎస్ డాలర్ తో మారకపు విలువతో పోలిస్తే, రూపాయి నష్టాలు కూడా ఇన్ఫోసిస్ గణాంకాలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపాయి. అందుకే రూపీ టర్మ్స్ లో సంస్థ గణాంకాలు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి.

Next Story