కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం.. ఎక్కడెక్కడ తిరిగారంటే.?

By Newsmeter.Network  Published on  19 March 2020 3:53 PM IST
కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం.. ఎక్కడెక్కడ తిరిగారంటే.?

కరీంనగర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరూ ఇండోనేషియా వాసులే.. దీంతో వారు ఇండోనేషియా నుంచి ఎప్పుడు వచ్చారు..? ఎక్కడెక్కడ తిరిగారు..అనే అంశాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో అనేక ఆశ్చర్య కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అనే ఇస్లామిక్‌ సంస్థకు చెందిన వారుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా జరిగిన, జరుగుతున్న ర్యాలీలను ఈ ఇండోనేషియా బృందాలే నిర్వహించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి కరోనా వైరస్‌ సోకడంతో వీరు ఎవరెవరితో తిరిగారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీరంతా ఇజ్తేమా అనే సంస్థ తరపున కరీంనగర్‌ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈనెల 14న వచ్చిన వీరు స్థానిక మసీదులోనే ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. వారు విదేశం నుంచి అక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండనున్నట్లుగా మరుసటి రోజు స్థానిక పోలీసులకు తెలిపారు. మార్చి 15న పోలీసులు వారిని మెడికల్‌ సర్టిఫికెట్లు అడగడంతో వారు స్థానిక ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లారని, అయితే ఈ పరీక్షల్లో ఒకరికి మాత్రమే కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాక వారందరినినీ వెంటనే గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ బృందం ఏఏ ప్రాంతాల్లో తిరిగారో సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మార్చి 14న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్‌ దిగిన అనంతరం స్టేషన్‌ ముందున్న ఆటో స్టాండ్‌ గుండా నడుచుకుంటూ వెళ్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో వైరల్‌ అవుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పుటేజిల్లో ఇండోనేషియన్లు గుంపుగా వెళ్తుండటం కనిపించింది. మరోవైపు కరోనా వైరస్‌ లక్షణాలున్న ప్రతిఒక్కరిని పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్‌, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు. కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌ ప్రాంతంలో బస చేయడంతో కలెక్టరేట్‌ చుట్టూ మూడు కిలో మీటర్ల మేర 144 సెక్షన్‌ విధించారు.

Next Story