గోవా: ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న 180 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ ప్రయాణికుల్లో ఓ మంత్రి కూడా ఉన్నారు.

ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. గోవా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. గోవా నుంచి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత విమానం ఎడమవైపు ఇంజిన్‌‌లో నుంచి మంటలు రావడం ప్రారంభించాయి.

ఆ సమయంలో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే ఇంజిన్‌ను ఆఫ్ చేసేశాడు. ఆ తర్వాత మరో ఇంజిన్ సాయంతో విమానాన్ని వెనక్కు మళ్లించాడు. గోవా విమానాశ్రయంలో దిగే వరకు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అందులో ఉన్న 180 మంది ప్రయాణికుల్లో గోవా మంత్రి నీలేష్ కాబ్రల్ కూడా ఉన్నారు. పైలెట్ చాలా తెలివిగా వ్యవహరించి 180 మంది ప్రాణాలు కాపాడారని మంత్రి నీలేష్ తెలిపారు. ఆ తర్వాత రాత్రి 12.40 గంటలకు మరో విమానంలో ప్రయాణికులు ఢిల్లీ వెళ్లారు. మరికొందరు మాత్రం వేరే ఫ్లైట్‌లో వెళ్లిపోయారు. అయితే, దీనిపై ఎయిర్‌లైన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story