గాల్లోకి ఎగరడం.. అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం.. ఏమిటీ పరిస్థితి..?

విమాన ప్రయాణం.. చిన్న పొరపాటు జరిగితే చాలు ఎంతో మంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోతూ ఉంటాయి. అందుకే అధికారులు కానీ.. విమానయాన సంస్థలు కానీ చాలా అప్రమత్తంగా ఉంటూ ఉంటాయి. ప్రతి ఏటా ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో దుఃఖాన్నీ నింపుతూ ఉంటాయి. ఇంజిన్ లో చిన్నపాటి సమస్యలు తలెత్తి చివరి నిమిషంలో విమానాలను ల్యాండింగ్ చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా చోటుచేసుకుంటుంటాయి.

ఇలాంటి ఘటనలు భారత్ లో ఆరు చోటుచేసుకున్నాయి.. అదేదో సంవత్సర కాలంలో జరిగిన ఘటనలా అని అనుకుంటే అది కూడా పొరపాటే..! అక్టోబర్ నుండి నవంబర్ 15 మధ్యలో ఏకంగా ఆరు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ విమానాలు గాల్లోకి ఎగరడం.. అనుకోకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడం.. వాటిని పైలట్లు అత్యవరంగా ల్యాండింగ్ చేయడం. ఇది గత ఒకటిన్నర నెలలో జరిగిన ఘటనలు. ఈ ఆరు ఘటనల్లో చివరగా హైదరాబాద్ కు పాట్నా నుండి వచ్చే గో ఎయిర్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రయాణీకులకు విపరీతమైన టెన్షన్ పెట్టింది.

నవంబర్ 2న , గో ఎయిర్ (A320) విమానం పాట్నా నుండి హైదరాబాద్ కు రావాల్సిన సమయంలో టెక్నీకల్ సమస్యలు తలెత్తాయి. ఈ విమానంలో P&W అన్ మాడిఫైడ్ ఇంజిన్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండో ఇంజన్ లో విపరీతమైన వైబ్రేషన్ రావడంతో విమానం ప్రయాణించడమే కష్టంగా మారింది. దీంతో పైలట్లు ఆ విమానాన్ని పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. ఆ ఇంజన్లను మోడిఫై చేయకుండానే వాడినట్లు తెలుస్తోంది.

సివిల్ ఏవియేషన్ అధికారుల రిపోర్టుల ప్రకారం ఈ ఆరు ఘటనల్లో విమానాల ఇంజన్స్ కారణంగానే సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా P&W 1100 G ఇంజన్లను ఎయిర్ బస్సు ఏ320 నియో ఎయిర్ క్రాఫ్ట్ లకు వాడడం వలన అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు.

ప్రతి ఒక్క ఎయిర్ లైన్స్ సంస్థకు ఇంజిన్లను మోడిఫై చేయాలని చెప్పినా కూడా వినిపించుకోకపోవడంతో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఈ ఘటనలపై స్పందిస్తూ.. జనవరి 31, 2020 లోపు ఇంజన్లను మోడిఫై చేయాలని డెడ్ లైన్ విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలు:

24-09-2019: కోల్ కతా నుండి చెన్నై వెళుతున్న ఇండిగో విమానం ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండో ఇంజన్ లో హై-వైబ్రేషన్ కారణంగా విమానాన్ని కోల్ కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు.

25-10-2019: ముంబై నుండి కోయంబత్తూర్ కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజన్ లో కూడా విపరీతమైన వైబ్రేషన్లు రావడంతో విమానాన్ని ఎగరడానికి కూడా వీలులేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

26-10-2019: ఢిల్లీలో కూడా ఇదే విధంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

28 -10-2019: అహ్మదాబాద్-వారణాసి ఇండిగో ఫ్లైట్ రెండో ఇంజన్ లో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

30-10-2019: కోల్ కతా-పూణే ఇండిగో విమానంలోని మొదటి ఇంజన్ లో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో డిపార్చర్ అవ్వకుండా ఆపేశారు. అంతేకాకుండా విపరీతంగా వైబ్రేషన్స్ కూడా ఇంజన్ లో కనిపించాయి.

02-11-19: పాట్నా నుండి హైదరాబాద్ కు రావాల్సిన గో ఎయిర్ విమానంలో టెక్నీకల్ స్నాగ్ కారణంగా పాట్నాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.