ముఖ్యాంశాలు

  • పేలవమైన బ్యాటింగ్
  • పదును లేని బౌలింగ్‌
  • ఫీల్డింగ్‌లో లోపాలు

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌పై ఎట్టకేలకు బంగ్లాదేశ్‌ జట్టు బోణీ చేసింది. తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి భారత్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సగర్వంగా నిలిచింది. ష‌కీబుల్ హ‌స‌న్, త‌మీమ్ ఇక్బాల్ లాంటి స్టార్ ఆట‌గాళ్లు లేకున్నా.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి రోహిత్‌ సేనకు గట్టి షాక్ ఇచ్చింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. దీనికి తోడు బంగ్లా జట్టు తొలి ఓవర్‌లోనే భారీ షాక్‌ ఇచ్చింది.

Image result for india vs bangladesh t20"

ఓపెనర్‌ ధవన్‌ 15 ఓవర్లపాటు క్రీజులో ఉన్నా హిట్టింగ్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ధవన్‌ ఆరంభం నుంచే ఆచితూచి ఆడడంతో పరుగుల వేగం ఆశించిన రీతిలో సాగలేదు. అయితే ఆఖరి రెండు ఓవర్లలో క్రునాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ 30 పరుగులు చేయ‌డంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అంతకుముందు ఇన్నింగ్స్‌ మొదటి బంతినే బౌండరీగా మలిచిన కెప్టెన్‌ రోహిత్‌ (9)ను అదే ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ ఓ కట్టర్‌ ద్వారా ఎల్బీ చేశాడు. దీనిపై రోహిత్‌ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది.

Image result for shivam dubey bangla t20"

టీమిండియా పవర్‌ప్లేలో కేవ‌లం 35 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. ఎన్నో అంచనాలతో అరంగేట్రం చేసిన శివమ్‌ దూబే (1) తీవ్రంగా నిరాశపరిచాడు. వేగంగా ఆడే క్రమంలో పంత్‌ (27) కూడా త్వ‌ర‌గానే పెవిలియన్‌కు చేరాడు. పేలవమైన బ్యాటింగ్ తో విఫ‌ల‌మైన టీమిండియా.. పదును లేని బౌలింగ్ తో తొలిసారి టి20ల్లో బంగ్లాదేశ్‌ చేతిలో భంగపడింది.

Image result for india vs bangladesh t20"

రాజధానిలో తీవ్రమైన కాలుష్యం మధ్యే సాగిన మొదటి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టార్‌ ఆటగాళ్లు లేకున్నా ఆ జట్టు ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఏ దశలోనూ దూకుడు కనబర్చని రోహిత్‌ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. దీనికితోడు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్ భార‌త బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ చివరి వరకు నిలిచి తన జట్టును గెలిపించుకున్నాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.