భారత కుబేరుల ఆస్తులకు భారీగా గండి.!

By అంజి  Published on  7 April 2020 6:15 AM GMT
భారత కుబేరుల ఆస్తులకు భారీగా గండి.!

హైదరాబాద్‌: మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కరోనా మరణమృదంగం మోగుతోంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కరోనా కష్టాలు తప్పడం లేదు. అపర కుబేరులకు కూడా కరోనా వైరస్‌ చుక్కలు చూపిస్తోంది. సామాన్యుల నుంచి.. ధనికుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పడిపోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలుతున్ఆనయి. మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం.. అపర కుబేరులపై చూపిస్తోంది.

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. గడిచిన రెండు నెలల్లో భారత స్టాక్‌ మార్కెట్‌ 26 శాతం వరకు నష్టపోయిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశంలో అధిక సంపద కలిగి ఉన్న దేశీయ బిలియనీర్ల సంపద పెద్ద మొత్తంలో కరిగిపోయింది. అందుకు తాజా ఉదాహరణ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపదే. ఈ సంవత్సరం జనవరి నెలఖారులో ముకేశ్‌ అంబానీ సంపద 6,700 కోట్ల డాలర్లు.. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి చివరి వారంలో ఆ సంపద 28 శాతం తగ్గి 4,800 కోట్ల డాలర్లకు చేరింది.

అంటే రెండు నెలల్లోనే 1.44 లక్షల కోట్ల ముకేశ్‌ అంబానీ సంపద కరిగిపోయింది. రోజుకు సగటున రూ.2,280 కోట్లను అంబానీ నష్టపోయారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితో తొమ్మిదో స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ.. మార్చి నెలాఖరుకు 17వ స్థానంలోకి పడిపోయారు. తాజాగా హురన్‌ గ్లోబల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ నివేదికలో ముకేశ్‌ అంబానీ సంపద ఆవిరి విషయాలను వెల్లడించింది.

భారత్‌లోని మిగతా బిలియనీర్లది పరిస్థితి కూడా ఇలానే ఉంది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ అదానీ సంపద 600 కోట్ల డాలర్లు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌ నాడార్‌ సంపద 500 కోట్ల డాలర్లు, ఉదయ్‌ కోటక్‌ సంపద 400 కోట్ల డాలర్లు కరిగిపోయింది. టాప్‌ 100 కుబేరుల జాబితా నుంచి ముగ్గురు భారతీయులు ఔట్‌ అయ్యారు.

13,100 కోట్ల డాలర్ల సంపదతో జెఫ్‌ బెజోస్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. 9,100 కోట్ల డాలర్లతో బిల్‌ గేట్స్‌ రెండో స్థానంలో ఉన్నారు.

కరోనా దెబ్బతో స్టాక్‌ మార్కెట్‌ పతనం కొనసాగింది. దీంతో గడిచిన రెండు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 5.2శాతంకు పడిపోయింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.80గా ఉంది.

Next Story