చైనా నుంచి భారతీయులను తెచ్చేందుకు ఎట్టకేలకు అనుమతి

By రాణి  Published on  25 Feb 2020 7:31 AM GMT
చైనా నుంచి భారతీయులను తెచ్చేందుకు ఎట్టకేలకు అనుమతి

ఎట్టకేలకు చైనాలో చిక్కుబడ్డ మన భారతీయులను కరోనా బారిన పడకుండా దేశానికి తీసుకువచ్చేందుకు అనుమతి లభించింది. ఇన్నాళ్లూ ఇందుకు అనుమతించని చైనా ఇప్పుడు ఆమోదం తెలపడంతో మిలటరీకి చెందిన ఒక విమానం మంగళవారం చైనాలోని వుహాన్ కు వెళ్లి, భారతీయులను తరలిస్తుంది. ఈ విమానం భారతీయులను తీసుకుని ఫిబ్రవరి 27న మళ్ళీ భారత్ కు వస్తుంది. వెళ్ళేటప్పుడు భారతీయుల కోసం మందులను కూడా తీసుకువెళ్లుంది.

ఇప్పటి వరకూ చైనా పలు ఇతర దేశాలకు అనుమతించినప్పటికీ భారత్ కు చెందిన పౌరులను తీసుకురావడానికి అనుమతించలేదు. చిట్ట చివరికి ఎలాగోలా అనుమతి లభించింది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్, యుక్రేన్ వంటి దేశాలకు తమ పౌరులను తీసుకువెళ్లే అనుమతి లభించింది. కానీ మన దేశానికి సోమవారమే అనుమతి లభించింది.

ఇప్పుడు మన దేశంలోని 21 విమానాశ్రయాల్లో, 12 పెద్దరేవులు, 52 చిన్న రేవులలో రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 4214 విమాన ట్రిప్పులలో 4,48,449 మంది ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. 2707 సాంపిల్స్ టెస్ట్ చేయగా, మూడు మాత్రమే పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ఈ ముగ్గురికి కూడా చికిత్స చేసి, డిశ్చార్జి చేయడం జరిగింది. సింగపూర్ వంటి ప్రాంతాలకు కూడా అవసరం లేకపోతే వెళ్లవద్దని మన దేశం ప్రయాణికులను హెచ్చరించింది. చైనా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, సౌత్ కొరియా, నేపాల్, వియత్నాం వంటి దేశాలనుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది. ఇవే కాక దాదాపు 35 వేల మందిని వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చి స్క్రీనింగ్ చేయడం జరిగింది.

Next Story