Fact Check : కరోనా వైరస్ అంటే భయపడని జనం.. గ్రహణానికి భయపడి రోడ్డు మీదకు కూడా రాలేదా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2020 7:20 PM ISTజూన్ 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది. ఆకాశంలో జరిగిన అద్భుతాన్ని పలువురు ఆస్వాదించారు. 'రింగ్ ఆఫ్ ఫైర్' అంటూ సూర్యుడికి అడ్డుగా మధ్యలో సరిగ్గా చంద్రుడు వచ్చాడు. సూర్యుడు వలయాకారంలో దర్శనమిచ్చాడు. మూడు గంటల పాటు సూర్యగ్రహణం ప్రజలకు కనువిందు చేసింది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రావడంతో ఏర్పడిన ఈ గ్రహణం.. మళ్లీ 2022 అక్టోబరు 25న భారతీయులకు కనిపించనున్నది. కరోనా ప్రభావంతో పాటు ఆదివారం సూర్యగ్రహణం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. సూర్యగ్రహణానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇలాంటి సమయంలో ఓ ఫ్లై ఓవర్ రోడ్ కు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అందులో ఒకే స్థలం.. రెండు సందర్భాల్లో తీసినదంటూ చెప్పుకొచ్చారు. రద్దీ ఉన్నది.. కరోనా ఉన్నా కూడా మనుషులు ఏ మాత్రం లెక్కచేయకుండా రోడ్ల మీదకు వచ్చారంటూ ఓ వైపు ఉండగా..! సూర్య గ్రహణం అనగానే రోడ్డంతా ఖాళీగా ఉంది అంటూ అందులో చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ అంటే భయపడని జనం.. సూర్య గ్రహణం అనగానే ఇళ్లకు పరిమితం అయ్యారంటూ ఆ ఫోటో ద్వారా తెలిపారు. భారత్ లో ఇలా చోటుచేసుకుందంటూ పలువురు షేర్ చేయడం మొదలుపెట్టారు.
నిజ నిర్ధారణ:
ఈ ఫోటోలు 'అబద్ధం' సూర్యగ్రహణం సమయంలో చోటుచేసుకుంది కావు.
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మార్చి 2020 కి సంబంధించిన ఫోటోలు. చాలా మీడియా సంస్థలు ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లోనూ, వెబ్ సైట్ల లోనూ పబ్లిష్ చేశాయి. మార్చి 22, 2020న ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్ల మీద ఒక్కరు కూడా కనిపించకుండా ఉండడంతో కొందరు కెమెరాలతో క్లిక్ అనిపించారు.
Scroll.in లో కూడా ఈ వైరల్ ఫోటోలను పోస్ట్ చేశారు. మార్చి 22, 2020న ఈ ఫోటో గురించి పోస్టు చేశారు. ఫిబ్రవరి 5, 2020న రద్దీగా ఉన్న బెంగళూరు రోడ్ కు సంబంధించిన ఫోటో ఒకటి.. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ కారణంగా నిర్మానుష్యమైన రోడ్డుకు సంబంధించిన ఫోటో అంటూ రెండిటి మధ్య ఉన్న తేడాను చూపించారు. [Photo: Manjunath Kiran/AFP]
ఇండియా టైమ్స్ కూడా బెంగళూరు లోని రోడ్డు ఎంత ఖాళీగా ఉందో అని తెలుపుతూ ఈ ఫోటోను పబ్లిష్ చేసింది.
Tribune వెబ్ సైట్ కూడా మార్చి 23, 2020 న 'Millions of Indians ordered to stay at home’ అంటూ ఆర్టికల్ ను పబ్లిష్ చేయడమే కాకుండా ఇదే ఫోటోను వాడుకుంది.
సూర్య గ్రహణం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.. ఈ ఫోటో జనతా కర్ఫ్యూ సమయం నాటిది.