ఉత్కంఠ పోరులో అద్భుత విజయం.. సెమీస్‌లోకి భారత మహిళల జట్టు

By Newsmeter.Network  Published on  27 Feb 2020 7:21 AM GMT
ఉత్కంఠ పోరులో అద్భుత విజయం.. సెమీస్‌లోకి భారత మహిళల జట్టు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 4 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్‌ స్టేజ్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో ఆడిన భారత మహిళల జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్‌ ను ఖరారు చేసుకుంది.

మెల్‌బోర్న్ వేదికగా న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన(11; 8బంతుల్లో 2 పోర్లు) జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఔటైంది. మరో ఓపెనర్‌.. షఫాలీ వర్మ (46; 34 బంతుల్లో 4పోర్లు, 3సిక్సర్లు) వన్‌ డౌన్‌ బ్యాట్ ఉమెన్‌ బాటియా(23; 25 బంతుల్లో 3పోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరు రెండో వికెట్‌ 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరు ఔటైన తరువాత టీమిండియా మిడిల్ ఆర్డర్‌ తడబడింది. ఓ దశలో 80/3 తో పటిష్టంగా ఉన్న భారత్‌.. 111/7తో నిలిచింది. అయితే.. ఆఖర్లో శిఖాపాండే(10; 14బంతుల్లో), రాధా యాదవ్‌(14; 9బంతుల్లో 1సిక్సర్‌) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

అనంతరం 134 పరుగులు చేధించడానికి బరిలోకి దిగిన కివీస్‌కు భారత బౌలర్లు షాకిచ్చారు. కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రాబట్టడానికి కివీస్ బ్యాటర్లు కష్టపడ్డారు. భారత బౌలర్ల ధాటికి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాడీగ్రీన్‌(24; 23బంతుల్లో 2పోర్లు, 1సిక్స్‌) క్యాటీ మార్టిన్‌(25; 28బంతుల్లో 3పోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో భారత బౌలర్లు పెవీలియన్‌ పంపారు. చివరి రెండు ఓవర్లలో అమెలియా కెర్ర్‌(34; 19బంతుల్లో 6పోర్లు), హయ్‌లీ జెన్‌సన్‌(11; 7బంతుల్లో 1పోర్‌) ధాటిగా ఆడడంతో భారత అభిమానుల్లో కంగారు మొదలైంది. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా.. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన శిఖాపాండే భారత్‌ను గెలిపించింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ, శిఖాపాండే, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Next Story