విండీస్‌పై టీ20 సిరీస్‌ను నెగ్గిన భారత మహిళలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 7:00 AM GMT
విండీస్‌పై టీ20 సిరీస్‌ను నెగ్గిన భారత మహిళలు

గయానా: వెస్టిండీస్‌ పర్యటనలో భారత మహిళా జట్టు అద్భుత విజయాలతో దూసుకెళుతోంది. వెస్టిండిస్‌ మహిళలతో టీ20 సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత మహిళలు వరుసగా మూడో టీ20లో విజయం సాధించి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా సిరీస్‌ను చేజిక్కించుకున్నారు.

అయితే తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 59 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. ఆపై 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా సిరీస్‌ను 3-0తో సాధించారు. వెస్టిండీస్‌ క్రీడాకారిణుల్లో చేదన్‌ నేషన్‌(11), హెన్రీ(11)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు సాధించగా, అనుజా పటేల్‌, పూజా వస్త్రాకర్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.

60 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు టీ20ల్లో పరుగుల వరద పారించిన స్మృతి మంధాన (3), షెఫాలీ వర్మ (0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇద్దరు జట్టు స్కోర్ 13 పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. కష్టాల్లో పడిన జట్టును జెమీమా రోడ్రిగ్స్‌ (40 నాటౌట్‌) అద్భుత ప్రదర్శనతో ఆదుకుంది. హర్మన్‌ప్రీత్‌ (7), దీప్తి శర్మ (7)లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. ఈ విజయంతో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story