హమ్మయ్యా..ఇండియాకి వచ్చేశాం..!

By రాణి  Published on  1 Feb 2020 10:12 AM GMT
హమ్మయ్యా..ఇండియాకి వచ్చేశాం..!

ముఖ్యాంశాలు

  • వుహాన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులు

వుహాన్. కరోనా వైరస్ వ్యాప్తికి మూలమైన ప్రధాన నగరం. చైనాలోని వుహాన్ నగరంలోనే మొదటి కరోనా కేసు బయటపడింది. ఇది మనిషి నుంచి మనిషికి సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్. డాక్టర్లు ఈ వైరస్ ను గుర్తించే లక్షణాలనైతే కనుగొన్నారుగానీ..దీనిని నయం చేసే మందుని మాత్రం కనుగొనలేకపోయారు. అయితే విద్య కోసం చైనా వెళ్లిన భారతీయ విద్యార్థులు వుహాన్, ఇతర నగరాల్లోనే ఉండిపోయారు. ఈ వైరస్ ఉందని తెలిసినప్పటి నుంచి చైనా విమాన సర్వీసులను నిలిపివేసింది. వుహాన్ నగరం పూర్తి నిర్భంధంలో ఉంది. ఎవరూ బయట తిరగరాదని ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. ఎట్టకేలకు భారత ప్రభుత్వ సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డామని హర్షం వ్యక్తం చేస్తున్నారు 324 మంది భారత విద్యార్థులు. ఎయిర్ పోర్టులో స్ర్కీనింగ్ టెస్టులు చేశాక వీరంతా బోర్డింగ్ పాసులు తీసుకుని మానేసర్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో అబ్జర్వేషన్ లో ఉన్నారు.

చైనా నుంచి తిరిగి వచ్చినందుకు వారి ఫీలింగ్ ఎలా ఉందో..ఒక వైద్య విద్యార్థి మాటల్లో...''నరకం నుంచి బయటపడినట్లు అనిపించింది. కరోనా గురించి తెలిసినప్పటి నుంచి తిరిగి మా అమ్మ నాన్నలను చూస్తానో లేదో అనుకున్నా. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అక్కడి నుంచి బయటపడినందుకు మా ఆనందానికి అవధులు లేవు. కానీ...కరోనా ఎంత ప్రమాదకరమైన వైరస్సో నాకు తెలుసు. కాబట్టి నేను 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాతే తల్లిదండ్రులను కలుస్తాను. నాకోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని మా వాళ్లకు చెప్పాు కూడా.'' అని మానేసర్ కేంద్రంలో ఉన్న వినయ్ చంద్ర పేర్కొన్నారు.

చైనా నుంచి తిరిగి తమ పిల్లలు స్వదేశానికి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వాళ్లంతా విమానం ఎక్కారని తెలిశాకే మేం సంతోషంగా ఊపిరిపీల్చుకోగలుగుతున్నామన్నారు. ఇన్నిరోజులు కంటిమీద కునుకు లేకుండా ఉన్నామని ఆవేదనకు గురయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులు.

వుహాన్ ఎయిర్ పోర్టులో భారత విద్యార్థులకు స్ర్కీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్న సమయంలో ఆరుగురు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించాయి. వారి శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో అధికారులు ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. స్వదేశానికి చేరుకున్న విద్యార్థుల్లో కొంతమంది మానేసర్ కేంద్రంలో ఉండగా...మరికొందరు ఐటీబీపీ ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉన్నారు.

Next Story