మన సంజీవినిలోని కొత్త కోణాన్ని చెప్పిన ఐసీఎంఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 7:39 AM GMT
మన సంజీవినిలోని కొత్త కోణాన్ని చెప్పిన ఐసీఎంఆర్

రెండు భిన్నధ్రువాలకు భలేగా లింక్ వేసినట్లుగా అనిపించొచ్చు. కానీ.. వాస్తవం అదేనన్నది మర్చిపోకూడదు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ అన్న వ్యక్తి ఏదైనా విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. సవాలచ్చ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు. అంత ఏమీ ఉండదని అనుకున్నా.. తన వ్యక్తిగత విషయాల్లో అయినా జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటాడు. ఆయన లాంటి పవర్ ఫుల్ నేత ఏదైనా ఒక మెడిసిన్ ను అంత తేలిగ్గా వాడరు కదా? దాని వెనుక ఎంతో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే.. వాడేందుకు ఓకే చెబుుతారు. ఈ వాదనకు బలం చేకూరేలా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం స్పష్టం చేస్తోంది.

భారత సంజీవినిగా అభివర్ణించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్ సీక్యూ) ఒక పద్దతి ప్రకారం తీసుకుంటే మాయదారి మహమ్మారి ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చని తాజాగా తేల్చింది. మహమ్మారి తన దరికి చేరకుండా ఉండేందుకు తాను హెచ్ సీక్యూను వాడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు చెప్పటం తెలిసిందే. దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. హెచ్ సీక్యూ కారణంగా లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదనకు భిన్నంగా తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసిన కొత్త అధ్యయనం ఆసక్తిర అంశాల్ని వెల్లడించింది.

పీపీఈ కిట్లు వాడటంతో పాటు.. హెచ్ సీ క్యూను వాడటం ద్వారా మహ్మమారి మీద పడే ప్రమాదం చాలావరకు నిలువరించొచ్చని చెప్పింది. హెచ్ సీ క్యూ సామర్థ్యం మీదా.. హెల్త్ కేర్ వర్కర్లకు వైరస్ సోకే ముప్పు ఎంతన్న విషయం మీద అధ్యయనం చేసిన నేపథ్యంలో.. తాము గుర్తించిన అంశాల్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. హెచ్ సీ క్యూను ఎంత మోతాదులో తీసుకుంటే మహమ్మారి సంక్రమించే అవకాశాలు ఎంత తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతూనే.. ఒక్క ఔషధం తీసుకుంటేనే సరిపోదని.. వారు పీపీఈ కిట్లను కూడా తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేసింది.

అదే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మాత్రం హెచ్ సీక్యూ తో ప్రయోజనాన్ని ఆశించలేమని పేర్కొంది. మాయదారి రోగం బారిన పడకుండా నిలువరించే అవకాశం ఉందని.. అదే సమయంలో అప్పటికే పాజిటివ్ అయిన వారిలో తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. హెచ్ సీక్యూతో ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. తాము జరిపిన అధ్యయనంలో సంజీవిని కారణంగా సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

ఈ మందు కారణంగా కేవలం 8 మందిలో మాత్రం వికారం.. ఐదు శాతం మందిలో తలనొప్పి.. నాలుగు శాతం మందిలో విరోచనాలు లాంటి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలు మాత్రం ఎవరికి రాలేదన్నారు. ఈ అధ్యయనం పదకొండు వందలకు పైనే జరిపినట్లుగా తెలిపారు. ఇదంతా చూసినప్పుడు ట్రంప్ తెలివితక్కువతనంతో హెచ్ సీక్యూను వాడలేదన్న భావన కలగటం ఖాయం.

Next Story