రైళ్ల సర్వీసులు పునరుద్ధణపై భారతీయ రైల్వే కీలక ప్రకటన..
By రాణి Published on 14 April 2020 4:21 PM ISTదేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. పొడిగించిన లాక్ డౌన్ తేదీ వరకూ అంటే మే 3వ తేదీ వరకూ అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. ప్యాసింజర్, ప్రీమియం, మెయిల్, ఎక్స్ ప్రెస్, సబర్బన్ రైళ్ల సర్వీసులతో పాటు కోల్ కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నామని తెలిపింది. అన్ని రైల్వే స్టేషన్లలో కౌంటర్లు మూసివేయబడుతాయని, ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసి నేరుగా రిఫండ్ ఇస్తామని చెప్పింది.
Also Read : కారులో పోలీస్ టోపీ..బయట పోలీస్ స్టిక్కరింగ్..పోలీసులకే బురిడీ
అంతకుముందు ప్రధాని ఏప్రిల్ 14 వరకూ ప్రధాని లాక్ డౌన్ పొడిగించడంతో..రైల్వే శాఖ కూడా 14వ తేదీ వరకూ రైళ్లు నడపటం లేదని ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ మే 3వరకూ రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. అదేవిధంగా ఐఆర్ సీటీసీ లో కూడా ఎలాంటి బుకింగ్స్ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గ్రహించి ప్రయాణికులు సహకరించాలని భారతీయ రైల్వే శాఖ కోరింది. కాగా..పార్శిల్ రైళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. నిత్యావసరాలను సరఫరా చేసేందుకు కాకినాడ - హైదరాబాద్, రేణిగుంట, నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య 32 పార్శిల్ రైళ్లు నడుస్తున్నాయ్.